అత్యధికంగా 8.20 శాతం వరకు వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్న ఐదు పోస్టాఫీసు పథకాలు
Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 14 May 2025, 9:53 am పోస్టాఫీసు పథకాలు సురక్షితమైన పెట్టుబడులుగా ఉంటున్నాయి. బ్యాంకు డిపాజిట్లకు పోటీగా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వంటి పథకాలు 8.20 శాతం వరకు వడ్డీనిస్తున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 7.10 శాతం, కిసాన్ వికాస్ పత్ర 7.50 శాతం, ఐదేళ్ల NSC VIII 7.70 శాతం వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. వీటితో పాటు పన్ను ప్రయోజనాలు కూడా ఉండటం విశేషం. పెట్టుబడిదారులకు ఇవి మంచి ఎంపికలుగా చెప్పవచ్చు.
పోస్టాఫీసు స్కీములు అత్యంత సురక్షితమైనవి. బ్యాంకు డిపాజిట్లకు పోటీగా ఇవి కూడా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. కొన్నింటికి చక్రవడ్డీ కూడా ఉన్నందున రాబడి బాగుటుంది. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే ఆదాయపు పన్ను ప్రయోజనం కూడా ఉంటుంది. అందుకే ప్రస్తుతం అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్న 5 పోస్టాఫీసు పథకాల గురించి ఇప్పుడు చూద్దాం.

పోస్టాఫీసు పథకాల వడ్డీ రేట్లు
సుకన్య సమృద్ధి యోజన
ఈ స్కీమ్ ను అమ్మాయిల కోసం ప్రత్యేకంగా రూపొందించింది కేంద్రం. ఇందులో కనీసం రూ. 250 తో పెట్టుబడి ప్రారంభించాల్సి ఉంటుంది. ఏడాదికి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ పథకానికి 8.20 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. సెక్షన్ 80సీ ద్వారా పన్ను ప్రయోజనం కూడా ఉంటుంది. చక్రవడ్డీ లభిస్తుంది. ఆడ పిల్లల తల్లిదండ్రులు కచ్చితంగా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయాలి. ఉన్నత చదువులు, పెళ్లి ఖర్చులకు ఉపయోగకరంగా ఉంటుంది.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్
ఈ స్కీమ్ ను సీనియర్ సిటిజన్ల (60 ఏళ్లు) కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఇందులో కనీసం రూ. 1,000 డిపాజిట్ చేయాలి. గరిష్టంగా రూ. 30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రస్తుతం వడ్డీ రేటు 8.20 శాతంగా ఉంది. ఈ స్కీమ్ టెన్యూర్ ఐదేళ్లు. సెక్షన్ 80సీ ద్వారా పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
ఈ స్కీమ్ టెన్యూర్ 15 సంవత్సరాలు. ప్రస్తుతం 7.10 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఇందులో కనీసం రూ. 500 ఇన్వెస్ట్ చేయాలి. ఏడాదికి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. సెక్షన్ 80 సీ ద్వారా పన్ను ప్రయోజనాలతో పాటు, లాభాలకు కూడా పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.
కిసాన్ వికాస్ పత్ర
ఈ స్కీమ్ లో కనీసం రూ. 1,000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎలాంటి నిర్దిష్ట పరిమితి లేదు. 2.5 సంవత్సరాల తర్వాత ఎన్ క్యాష్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకానికి 7.50 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. అయితే దీనికి ఎలాంటి పన్ను ప్రయోజనాలు ఉండవు.
ఐదేళ్ల NSC VIII
ఐదు సంవత్సరాల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ (VIII-Issue) స్కీమ్ లో కనీసం రూ. 1,000 పెట్టుబడి పెట్టాలి. గరిష్ట పరిమితి లేదు. ప్రస్తుతం ఈ పథకానికి 7.70 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. సెక్షన్ 80సీ ద్వారా పన్ను మినహాయింపు ఉంటుంది. టీడీఎస్ డిడక్షన్ లేదు.
Personal Finance, ఆదాయపు పన్నుకు సంబంధించి మరింత సమాచారంతో పాటు లేటెస్ట్ అప్‌డేట్స్ పొందడం కోసం
Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగును సందర్శించండి.
భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producerభరత్ కలకొండ ఎకానమిక్స్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌కు సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో నాలుగున్నర సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ రంగాలకు సంబంధించిన వార్తలు రాశారు.Read More